నమస్తే, నేను Shiv Shankar. ఇది నా భార్య Pinky Sharma. మేమిద్దరం కలిసి నడిపే సైట్ ఇది. ఆమె పేరు మీదే దీనికి InfoPinky అని పేరు పెట్టుకున్నాం.
ఈ పేజీ కొంచెం పెద్దది. ఎందుకంటే ఇది ఒక సైట్ గురించి రాసిన ప్రకటన కాదు. మేము ఎవరం, ఈ సైట్ ఎందుకు మొదలుపెట్టాం, మీకు మేము ఇచ్చే మాట ఏమిటి అనేది మనసు విప్పి చెప్పాలనుకుంటున్నాం. కాసేపు ఓపిక పట్టి చదవండి.
మేమిద్దరం ఎవరం?
మేము భార్యాభర్తలం. ఇద్దరిదీ MBA నేపథ్యమే. ఇద్దరం చదువుకున్నది ఒకే ఊరిలో: ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో.
నేను: JNTU Hyderabad (Kukatpally)లో MBA in Finance పూర్తి చేశాను. అందులో నాకు 79.3 శాతం అగ్రిగేట్ వచ్చింది. హైదరాబాద్‌లో లైసెన్స్ ఉన్న బిజినెస్ కన్సల్టెంట్‌ని, ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తుంటాను. గతంలో వెబ్సైట్ డిజైన్, కొన్ని డిజిటల్ సర్వీసులు కూడా చేశాను. కానీ ఈ సైట్‌కి ఆ పనులతో ఏ సంబంధం లేదు.
Pinky: B.A. (ఎకనామిక్స్) చేసి, ఇప్పుడు తాడేపల్లిగూడెంలోని Sri Vasavi Engineering Collegeలో MBA చదువుతోంది. ఆ కాలేజీ JNTU Kakinadaకు అనుబంధంగా ఉంది. మొదటి సంవత్సరం MBAలో ఆమెకు 89 శాతం వచ్చింది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ నడుస్తోంది. చివరి పరీక్షలు, ఫైనల్ ఫలితాలు వచ్చాక ఆమె మార్కులు ఇదే పేజీలో అప్డేట్ చేస్తాం.
ఇద్దరం కలిసి పని చేస్తాం. నేను రాసిన ఆర్టికల్స్‌ని ఆమె ఎడిట్ చేస్తుంది. ఆమె రాసినవి నేను ఎడిట్ చేస్తాను. రీసెర్చ్, ఫ్యాక్ట్ చెకింగ్‌లో కూడా తనే నాకు తోడు. ప్రతి ఆర్టికల్ ఇద్దరి కళ్ల మీదుగా వెళ్లాకే బయటకు వస్తుంది.
ఈ సైట్ ఎందుకు మొదలుపెట్టాం?
మేము పుట్టి పెరిగింది, చదువుకున్నది మన ఊళ్లలోనే. అక్కడ పల్లెటూరి కుర్రాళ్ల కష్టాలు, చిన్న చిన్న కలలతో వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వాళ్ల తిప్పలు కళ్లారా చూశాం, చూస్తున్నాం. చాలా మందితో మాట్లాడుతుంటాం. మన ఊళ్లలో ఏమేం జరుగుతున్నాయో చర్చించుకుంటాం. ఆ బాధ మాకు తెలుసు.
ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలో తెలియదు. రిజిస్ట్రేషన్ ఎక్కడ, ఎలా చేయించుకోవాలో తెలియదు. ప్రభుత్వ లోన్ ఉందని వింటారు, కానీ అర్హత ఏమిటో, ఏ కాగితాలు కావాలో చెప్పేవాళ్లు ఉండరు. బ్యాంకు వాళ్లని అడగాలంటే భయం. ఎవరో ఏజెంట్ దొరుకుతాడు, “నేను చూసుకుంటా, డబ్బులు ఇవ్వు” అంటాడు. ఇలాంటి పరిస్థితిలో చాలా కలలు ఆగిపోతాయి. ఇది మాకు నచ్చలేదు. అందుకే ఈ సైట్ మొదలుపెట్టాం.
మేము ఈ కంటెంట్‌ని ఇంగ్లీష్‌లో రాయొచ్చు, దేశమంతా చదివేలా చేయొచ్చు. కానీ తెలుగులో ఈ రకమైన కంటెంట్‌ని నిరంతరం ఇచ్చే వాళ్లు చాలా తక్కువ. ఉన్న కొన్ని న్యూస్ చానల్స్, సైట్లు కూడా పాఠ్యపుస్తకం భాషలో చెప్తాయి. మనకు మాత్రం పక్కింటి వాడు, చదువుకున్న వాడు, మన కష్టం తెలిసినవాడు మన భాషలో, మనలాగే మాట్లాడి చెప్తే అర్థమవుతుంది. అందుకే మేము మా సొంత బాడీ లాంగ్వేజ్‌తో, మా సొంత దృష్టికోణంతో, మీతో నేరుగా మాట్లాడుతున్నట్టు రాస్తాం.
ఎవరి కోసం ఈ సైట్?
ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వాళ్ల కోసం. అంటే పెట్టుబడి లేకుండా మొదలుపెట్టే వాళ్లు, తక్కువ లేదా మధ్య స్థాయిలో చిన్న వ్యాపారం చేసేవాళ్లు, ఏపీలో ఏర్పాటవుతున్న MSMEల యజమానులు. ఈ సైట్ ఏపీ గురించే, ఏపీ ప్రజల గురించే. మన ప్రజల కోసం కాబట్టి తెలుగులోనే రాస్తున్నాం.
యువ వ్యాపారవేత్తలకు, జీరో పెట్టుబడితో మొదలుపెట్టే వాళ్లకు, చిన్న వ్యాపారులకు ఇది మేము ఇస్తున్న మాట. ఈ సైట్ మా ఆలోచన. ఈ సైట్ మా నిజాయితీ.
మేము ఏం రాస్తాం? ఎలా రాస్తాం?
- తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టగల చిన్న బిజినెస్ ఐడియాలు
- వ్యాపార రిజిస్ట్రేషన్, Udyam / MSME ప్రక్రియ
- ప్రభుత్వ పథకాలు, లోన్ల అర్హతలు, షరతులు
- లోన్ లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియల్లో వచ్చే సమస్యలను ఎలా దాటాలి
ఇక్కడ మేము అందరికీ సరిపోయే సాధారణ సమాచారం రాస్తాం. ఒక్కొక్కరికి ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా రూపొందించిన కంటెంట్ ఈ సైట్లో ఉండదు. ఏపీలోని ఏ చిన్న, మధ్య లేదా జీరో పెట్టుబడి వ్యాపారవేత్త అయినా తమ పరిస్థితికి తగ్గట్టు వాడుకోగలిగేలా రాస్తాం.
ప్రతి ఆర్టికల్ రాసే ముందు ప్రభుత్వ పోర్టల్, అధికారిక పాలసీ, బ్యాంకు వెబ్సైట్ చూస్తాం. తేదీ, అర్హత, పరిమితి, దరఖాస్తు దశలు స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఏదైనా సంఖ్య నిర్ధారణ కాకపోతే దాన్ని ఖచ్చితమైనదిగా రాయం. తప్పు కనిపిస్తే hello@infopinky.com కి చెప్పండి, సరిచేస్తాం.
మీకు సహాయం కావాలంటే
ఈ సైట్ ఉచిత గైడ్ల కోసమే. అయినా ఒక పేదవాడికి నిజంగా సహాయం అవసరమైతే, ఉచిత సేవ ఇస్తాం. కేవలం అలాంటి వాళ్లకే.
మీ వ్యాపార కల మొదలుకాకుండా ఏదైనా బయటి పని ఆగిపోతూ ఉంటే, అంటే రిజిస్ట్రేషన్, లోన్ దరఖాస్తు, ఇంకేదైనా పేపర్ వర్క్ లాంటిది, మీరు మాకు ఇమెయిల్ చేయండి: hello@infopinky.com. మీ ఊరు, మీ దగ్గర ఉన్న పెట్టుబడి, ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు, ఎక్కడ ఆగిపోయారు అనేది క్లుప్తంగా రాయండి.
మేము అదే ఇమెయిల్‌కి జవాబు ఇస్తాం. మా దగ్గర ఉన్న ఉచిత గైడ్లను, దశల వారీగా ఎలా చేయాలో చెప్పే వివరాలను మీకు ఇమెయిల్ ద్వారా పంపిస్తాం. మీరు దరఖాస్తు చేసేటప్పుడు వాటిని చూసి ముందుకు వెళ్లొచ్చు. ఇదంతా పూర్తిగా ఉచితం.
ఒక మాట ముందే నిజాయితీగా చెప్తున్నాం. స్థిరపడిన పెద్ద వ్యాపారాలతో మేము పని చేయము. మా సేవ కలలు మొదలుపెట్టే వాళ్లకే, అవసరం ఉన్నవాళ్లకే. మేము ఏ వ్యాపారాన్నీ, ఏ కన్సల్టెన్సీనీ ప్రమోట్ చేయడానికి ఇక్కడ లేము. మా సొంత కన్సల్టెన్సీని, మా సొంత పనిని కూడా కాదు.
మా ప్రయాణం, మా కల
మేమిద్దరం నెలకు మూడు నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య తిరుగుతాం. దానికి కారణం Pinky చదువు. ఆమె ఫైనల్ ఇయర్ MBA పూర్తయ్యాక, బహుశా మేము ఆంధ్రప్రదేశ్‌కే వచ్చేస్తాం. ఎందుకంటే హైదరాబాద్‌లో మాకు సొంత ఇల్లు లేదు. మా కల ఆంధ్రప్రదేశ్‌లో సొంత ఇల్లు కట్టుకోవడం. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం.
ఈ ప్రయాణాల్లో, మన ఊళ్లలో, మనవాళ్లతో మాట్లాడిన ప్రతిసారీ చిన్న వ్యాపారాల గురించి ఏదో ఒక కొత్త ప్రశ్న వింటూనే ఉంటాం. ఆ ప్రశ్నలకే ఈ సైట్లో జవాబులు రాస్తున్నాం.
మేము చదువుకున్న వాళ్లం, ఉత్సాహం ఉన్నవాళ్లం. మనకు తెలిసిన జ్ఞానంతో అవసరంలో ఉన్న వాళ్లకు తోడుగా నిలబడాలి, దేశానికి మనవంతు ఏదైనా చేయాలి అనే ఆలోచనతోనే ఈ సైట్ పెట్టాం. అంతే. దీని వెనుక వేరే ఉద్దేశం ఏదీ లేదు.
మా ప్రమాణం
ఈ సైట్లో మేము ఒక్క ఈ-బుక్ కూడా అమ్మము. ఏ ప్రొడక్ట్ కొనమని చెప్పి ఏ లింకూ ఇవ్వము. ఏ కంపెనీకీ, బ్రాండ్‌కీ, కన్సల్టెన్సీకీ అఫిలియేట్ కాదు. ఏ థర్డ్ పార్టీ పెయిడ్ సర్వీసునూ ప్రమోట్ చేయము. ఇది పూర్తిగా ఉచిత గైడ్ల సైట్.
ఈ సైట్లో ఎక్కడైనా మీరు డబ్బు కట్టాల్సిన పరిస్థితి వస్తే, ఆ రోజే ఈ సైట్‌ని మూసేస్తాం. అలా జరిగే అవకాశం దాదాపు లేనే లేదు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి అలా జరిగితే, అదే రోజు సైట్ మూసేస్తాం.
ఇది ఒక్క మాట కాదు. మేము శివుడిని నమ్ముతాం. ఆ శివుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాం: మేము మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోము.
— Shiv Shankar & Pinky Sharma, InfoPinky
మేము ప్రభుత్వ ప్రతినిధులం కాదు, లోన్ లేదా సబ్సిడీ మంజూరు చేసే అధికారం లేదు. ఈ సైట్‌లోని సమాచారం సాధారణ అవగాహన కోసం. నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత బ్యాంకు లేదా కార్యాలయంతో నిర్ధారించుకోండి.





